మహానటులు ఎన్టీఆర్ అంటే సూపర్ స్టార్ కృష్ణకు విపరీతమైన అభిమానం. ఎన్టీఆర్ సినిమాలను చూస్తూ ఆయన్ని ఆరాధించారు. అలాగే సినిమాల్లోకి వచ్చిన తొలినాళ్ళలో కూడా ఎన్టీఆర్ ను అమితంగా ఆరాధించేవారు కృష్ణ. అలాంటి కృష్ణ ఒకదశలో ఎన్టీఆర్ ను తీవ్ర స్థాయిలో వ్యతిరేకించారు. ఇంతకీ ఎన్టీఆర్ కు కృష్ణకు ఇంతగా విబేధాలు ఎందుకు వచ్చాయో తెలుసా…….. అల్లూరి సీతారామరాజు చిత్రం వల్ల.
మన్యం విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రను పోషించాలని అనుకున్నారు ఎన్టీఆర్. అందుకు స్క్రిప్ట్ కూడా పూర్తి చేసుకున్నారు. అయితే అప్పట్లో ఎన్టీఆర్ చాలా బిజీగా ఉండేవారు. దాంతో ఆ సినిమా వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చింది. ఇక కృష్ణ కూడా చాలా బిజీ అయినప్పటికీ అన్నగారు ఎలాగూ అల్లూరి సీతారామరాజు చిత్రం చేయడం లేదు కాబట్టి ఆ సినిమా చేద్దామని స్క్రిప్ట్ వర్క్ చేయించారు. సినిమా తీసే ముందు ఎన్టీఆర్ దగ్గరకు వెళ్లి అన్నగారు …… అల్లూరి సీతారామరాజు చిత్రాన్ని మేము చేయాలనుకుంటున్నాం. మీరు చేస్తే నేను తప్పుకుంటాను. లేదంటే నేను తీసుకుంటాను అని చెప్పారట. అయితే కారణం ఏంటో కానీ నేను ఇప్పట్లో చేయను …… మీరు కూడా చేయొద్దు అని అన్నారట. దాంతో కృష్ణ కు ఎక్కడో ఇగో హర్ట్ అయ్యింది. అంతే అల్లూరి సీతారామరాజు చిత్రాన్ని ప్రారంభించారు. దాంతో రెండు వైపులా ఉండే వాళ్ళతో ఎన్టీఆర్ – కృష్ణల మధ్య అగాధాన్ని సృష్టించింది.
కట్ చేస్తే అల్లూరి సీతారామరాజు చిత్రం పూర్తి కావడం జరిగింది. అయితే అప్పుడు మళ్లీ ఎన్టీఆర్ దగ్గరకు వెళ్లిన కృష్ణ మీరు సినిమా చూడాలని కోరారు. కృష్ణ కోరికను మన్నించిన ఎన్టీఆర్ సినిమా చూసి అద్భుతంగా తీశారు బ్రదర్….. అయితే ఈ సినిమా విడుదల అయ్యాక మాత్రం ఇది పెద్ద హిట్ అవుతుంది……. కానీ ఆ తర్వాత కొన్ని సంవత్సరాల పాటు మీ సినిమాలన్నీ ప్లాప్ అవుతూనే ఉంటాయని చెప్పారట ఎన్టీఆర్. అప్పట్లో ఎన్టీఆర్ చెప్పినట్లుగానే అల్లూరి సీతారామరాజు చిత్రం ప్రభంజనం సృష్టించింది. ఆ తర్వాత కృష్ణ నటించిన చాలా చిత్రాలు ప్లాప్ అయ్యాయి.
ఇక రాజకీయాల్లో కూడా ఎన్టీఆర్ ను తీవ్రంగా విభేదించారు కృష్ణ. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించిన సమయంలో కృష్ణ ను కూడా ఎన్టీఆర్ ఆహ్వానించారట. అయితే రాజకీయాలు ఇష్టంలేని కృష్ణ టీడీపీలో చేరలేదు. కట్ చేస్తే రాజీవ్ గాంధీ కోరిక మేరకు కాంగ్రెస్ పార్టీ తరుపున టీడీపీకి వ్యతిరేకంగా ప్రచారం చేశారు కృష్ణ. అంతేకాదు 1989 లో ఏలూరు పార్లమెంట్ స్థానం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు కృష్ణ. అయితే అప్పట్లో రెండేళ్లకే అప్పటి కేంద్ర ప్రభుత్వం కుప్పకూలడంతో 1991 లో మళ్లీ లోక్ సభకు ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో కూడా పోటీ చేసినప్పటికీ ఓటమి చవిచూశారు కృష్ణ. ఇక ఆ తర్వాత రాజకీయాల వైపు చూడలేదు. ఎన్టీఆర్ ను అల్లూరి సీతారామరాజు విషయంలో అలాగే రాజకీయంగా విభేదించినప్పటికి ….. ఎన్టీఆర్ నా అభిమాన హీరో అని ప్రకటించి సంచలనం సృష్టించిన డేరింగ్ , డాషింగ్ హీరో కృష్ణ. తెలుగుతెర పై సాహసమే నా ఊపిరి గా బ్రతికిన సూపర్ స్టార్ .