
Corona New Variant :
కరోనా మహమ్మారి.. రెండేళ్ల క్రితం ప్రపంచాన్ని అల్లాడించింది. ప్రలజందరి గుండెల్లో వణుకు పుట్టించింది. ఎన్నో ప్రాణాలను బలితీసుకుంది. ప్రతి మనిషి.. ఎదుటివాడిని అనుమానంగా చూసే పరిస్థితిని తీసుకొచ్చింది. చాలా దేశాలు, చాలా ప్రాంతాలు, ఎన్నో కుటుంబాలు ఇంకా కరోనా సృష్టించిన అగాథం నుంచి ఇంకా బయటపడలేదు. కరోనా పేరు చెబితేనే వణికిపోయేలా చేసింది. భగవంతుడా కాపాడూ అంటూ ప్రార్థించని మనసులు లేవు. చెయ్యెత్తి మొక్కని చేతులు లేవు. అత్యంత ప్రమాదకర విపత్తులా ప్రపంచాన్ని ఇంటికే పరిమితం చేసిన ఈ కరోనా విలయం.. మళ్లీ రాబోతుందా.. ఇప్పటికే పలు దేశాల్లో విస్తరిస్తున్నదా.. అంటే అవుననే సమాధానం వైద్యరంగ నిపుణుల నుంచి వినిపిస్తున్నది.
చైనాలో పుట్టిన ఈ వైరస్ దేశాలను దాటుకుంటూ పెద్ద మారణహోమం సృష్టించింది. కొంతకాలం పాటు జనజీవనం స్తంభించింది. ఎన్నో కుటుంబాల జీవితాలు ఛిద్రమయ్యాయి.అయితే క్రమంగా వైరస్ తన ప్రభావాన్ని కోల్పోవడం ప్రపంచానికి ఊరటనిచ్చింది. ఇక కరోనా అంటే కొంత భయం పోయింది. అయితే తాజాగా వస్తున్న వేరియంట్లు చూస్తుంటే మాత్రం మళ్లీ ఆరోజులు రాబోతున్నాయనే సూచనలు వైద్య రంగ నిపుణుల నుంచి వస్తున్నాయి. ఇప్పటికే పలు రకాల వేరియంట్లు రాగా, అంత ప్రభావం చూపలేకపోయాయి. అయితే తాజాగా యూకేలో మరో కొత్త వేరియంట్ ను వైద్యరంగ నిపుణులు గుర్తించారు. దీనిని ఎరిస్ గా గుర్తించారు. దీనికి ఈజీ 5.1 గా నామకరణం చేశారు. ఒమిక్రాన్ నుంచి ఈ వేరియంట్ వచ్చినట్లు శాస్ర్తవేత్తలు గుర్తించారు. గత నెలలో యూకేలో మొదటి సారి దీని ప్రభావం కనిపించగా, ఇప్పుడు దేశ వ్యాప్తంగా ప్రభావం చూపుతున్నది. ఇప్పుడు ప్రతి ఏడు కేసుల్లో ఒకటి ఎరిస్ అని గుర్తించారు. గత వారం నుంచి ఈ కేసులు మరింత పెరిగాయని అక్కడి ప్రభుత్వం చెబుతున్నది. అయితే దవాఖానల్లో చేరుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగింది.
అయితే ఈ వేరియంట్ వచ్చిన వారు చేతులు తరుచుగా కడుక్కోవాలని చెబుతున్నారు. యూకే హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ రిపోర్టు ప్రకారం శ్వాసకోశ వ్యాధులు ఉన్నవారు సాధ్యమైనంత మేర ఇతరులకు దూరం ఉండాలి. ఆరోగ్యంపై చిన్న సందేహం ఉన్నా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. వ్యాక్సిన్, ముందస్తు చర్యల ద్వారా కొంత రక్షణ పొందుతున్నప్పటికీ కొంత నిర్లక్ష్య ధోరణి పనికిరాదని చెప్పింది. కొత్త వేరియంట్ వ్యాప్తి తరుణంలో నిపుణులంతా నిశితంగా పరిశీలిస్తున్నారని, అరికట్టేందుకు చర్యలపై సూచనలు, సలహాలు అందిస్తున్నారిన యూకేహేఎచ్ఎస్ఏ తెలిపింది. అయితే కొత్త వేరియంట్ అంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో మరోసారి ప్రజల్లో కొంత భయాందోళనలు నెలకొన్నాయని పేర్కొంది. అప్రమత్తతే మొదటి మందు అని, దీనిని ప్రజలు గుర్తించాలని తెలిపింది.