Canada – India :
ఖలిస్థాన్ వేర్పాటు వాద మద్దతు దారు నిజ్జార్ హత్య ఇప్పుడు భారత్, కెనడా ల మధ్య ఉద్రిక్తతలకు దారితీసింది. అయితే గతేడాది జరిగిన ఈ హత్య ఇప్పుడు రాజకీయంగా విభేదాలకు కేంద్ర బిందువైంది. భారత్ కు మోస్ట్ వాంటెడ్ గా ఉన్న ఈ హర్దీప్ సింగ్ నిజ్జార్ పై కొంతకాలంగా భారత్ నిఘా పెట్టినట్లు సమాచారం. అయితే అనుకోకుండా ఆయన హత్యకు గురయ్యారు. దీని వెనుక భారత్ ఏజెంట్ల పాత్ర ఉందని కెనడా ప్రధాని జస్టిస్ ట్రూడో ఆరోపణలు కలకలం రేపాయి. దీంతో పాటు భారత దౌత్యవేత్తను కూడా కెనడా బహిష్కరించింది. దీంతో ఈ వివాదం మరింత ముదిరింది.
అయితే ఈ కెనడా పౌరుడైన హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్యలో భారత్ పై ఆరోపణలు చేస్తున్న కెనడా, తాజాగా తన మిత్ర దేశాలైన అమెరికా, అస్ర్టేలియా, న్యూజిలాండ్, బ్రిటన్ సాయం కోరింది. తమ ఏజెంట్లను పంపి, తమ పౌరుడిని హత్య చేయడమే కాకుండా తమపై ఎదురు దాడి చేస్తోందంటూ జస్టిస్ ట్రూడో తన నాలుగు మిత్రదేశాలకు సమాచారం పంపారు. దీంతో ఆయా దేశాలతో సత్సంబంధాలు కొనసాగిస్తున్న భారత్ కు ఇబ్బందికర పరిస్థితి తలెత్తింది.
అయితే ఇప్పుడు కెనడాలో ఉన్న భారతీయుల రక్షణ విషయం ఇప్పుడు తెరపైకి వచ్చింది. ఇప్పడు భారతీయులు ఎక్కువగా ఉన్న దేశంగా 16 లక్షల మంది భారతీయ మూలాలు కలిగిన వారు ఆ దేశంలో ఉన్నారు. కెనడాలో భారత విద్యార్థులు కూడా ఎక్కువ సంఖ్యలో నే ఉన్నారు. కెనడాతో భారత వాణిజ్యంపై కూడా ఇది ప్రభావం చూపే అవకాశం కనిపిస్తున్నది. రెండు దేశాల మధ్య 11.68 బిలియన్ల యూఎస్ డాలర్ల బిజినెస్ ఉంది. అయితే ఏదేమైనా జీ 20 సదస్సు విజయవంతం అయిన తర్వాత ఈ రకమైన వివాదం తెరపైకి రావడ ఇప్పుడు భారత్ కు ఇబ్బందికరంగా మారింది. నిజ్జార్ హత్యపై విచారణకు సహకరించాలని ట్రూడో ఇప్పటికే భారత్ ను కోరారు. భారత్ మాత్రం దీనిపై మౌనం వహిస్తున్నది. అయితే ఇప్పుడు ఈ హత్యపై కెనడా సేకరించిన సాక్ష్యాలు తమ మిత్రదేశాలతో పంచుకునే అవకాశం ఉంది. ఒకవేళ ఇందులో భారత్ ఏజెంట్ల పాత్ర ఉందని తేలితే ఇబ్బందికర పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని విదేశాంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.