CM Revanth : ఏప్రిల్ లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. దీని కోసం పార్టీలు ప్రచారం నిర్వహించేందుకు కసరత్తులు ప్రారంభించాయి. కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి సార్వత్రిక ఎన్నికల వరకు పీసీసీ సారధిగా ఉండటంతో అభ్యర్థుల ఎంపికలో కూడా ఆయన మాట పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు లోక్ సభ ఎన్నికల్లో కూడా తీసుకురావాలనే యోచనలో ఉన్నట్లు చెబుతున్నారు.
ఈ ఎన్నికల్లో ఆశావహుల సంఖ్య పెరుగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి తమ్ముడు తిరుపతి రెడ్డి ఎంపీగా పోటీ చేస్తారని తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ తో పాటు చేవెళ్ల స్థానాల బాధ్యతలు పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే 17 లోక్ సభ స్థానాలకు 309 మంది దరఖాస్తు చేసుకున్నారు. తిరుపతి రెడ్డి కూడా ఎంపీగా పోటీ చేయాలని చూస్తున్నారు.
తిరుపతి రెడ్డి ముఖ్యమంత్రి సోదరుడిగా కాకుండా ఒక నాయకుడిగా గుర్తించాలంటున్నారు. సీట్ల కేటాయింపుపై రేవంత్ రెడ్డి చర్చలు జరుపుతున్నారు. రేవంత్ రెడ్డి మరో సోదరుడు కొండల్ రెడ్డి పేరు కూడా పరిశీలనలోకి వస్తోంది. మల్కాజిగిరి నుంచి ఆయన పేరు వినిపిస్తున్నట్లు సమాచారం. ఇక్కడ నుంచే సినీ నిర్మాత బండ్ల గణేష్ పేరు కూడా పరిశీలిస్తున్నారు.
కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావు, మాజీ మంత్రి జానారెడ్డి కుటుంబాల నుంచి టికెట్లు ఆశిస్తున్నవారున్నారు. దీంతో జాబితా తయారు చేయడం రేవంత్ రెడ్డికి పరీక్షగానే మారింది. తెలంగాణలో విజయం సాధించాలంటే సమర్థులైన వారిని ఎంపిక చేయడం కష్టంగానే మారింది. రేవంత్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోననే సందేహాలు అందరిలో వస్తున్నాయి.