
Nara Lokesh : టీడీపీ యువ నేత లోకేష్ రాష్ర్టంలో యువగళం పాదయత్ర నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఆయన పాదయాత్ర బనగానపల్లి నియోజకవర్గంలోకి ప్రవేశించింది. అయితే అంతకుముందు నంద్యాల నియోజకవర్గంలో పాదయాత్ర చేశారు. పాదయాత్రకు జనం నుంచి అనూహ్య స్పందన వస్తున్నది.
అయితే శనివారం ఉదయం నంద్యాల నియోజకవర్గ రాయపాడు క్యాంప్ సైట్ లో పలువురు ప్రముఖులతో లోకేష్ ముఖాముఖి సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల వైఎస్ రాజశేఖర్ రెడ్డికి తాను ఎందుకు నివాళులర్పించారని కొందరు అడుగుతున్నారని, ఆయన ఏనాడు రాష్ట్ర పరువు తీసేలా ప్రవర్తించలేదని, చంద్రబాబు తీసుకొచ్చిన ప్రాజెక్టులను కొనసాగించారని పేర్కొన్నారు. అందుకే ఆయనంటే తనకు గౌరవమని, జగన్ మాత్రం ఏపీని దక్షిణాది బిహార్ గా మార్చాడని విమర్శించారు.
ఆఖరికి మీడియాను కూడా వదల్లేదని మండిపడ్డారు. డాక్టర్లు కాంట్రాక్టర్లు ఉద్యోగులు, పోలీసులు అందరినీ ఇబ్బందులకు గురి చేశాడని గుర్తు చేశారు. ఎన్నికల ముందు ఇస్తానన్న మెగా డీఎస్సీ హామీ ఏమైందని ప్రశ్నించారు జర్నలిస్టులను కూడా అన్ని విధాలుగా వేధిస్తున్నారని ఆరోపించారు 2,430 జీవో తెచ్చి వేధింపులు, అరెస్టులకు పాల్పడుతున్నాడని మండిపడ్డారు. ఆఖరికి అక్రిడిటేషన్ కార్డులు కూడా రద్దు చేశారని, టీడీపీ అధికారంలోకి వస్తే వాటిని పునరుద్ధరిస్తామని పేర్కొన్నారు.
అదే విధంగా టీడ్కో ఇండ్లు ఇస్తామని తెలిపారు. యూట్యూబ్ ఛానల్ జర్నలిస్టులకు కూడా అక్రిడిటేషన్ కార్డులు ఇస్తామని పేర్కొన్నారు. అదేవిధంగా మీ సేవ వ్యవస్థను మరింత పటిష్ట పరుస్తామని తెలిపారు. పేదరికం లేని సమాజమే టీడీపీ ధ్యేయమని చెప్పుకొచ్చారు. మెగా డీఎస్సీ హామీ ఏమైందని, ఏపీకి వచ్చిన కంపెనీలు ఏవని ప్రశ్నించారు. జగన్ ది ఫ్యాక్షన్ మనస్తత్వమని అందుకే రాష్ర్టాన్ని అధోగతి పాలు చేస్తూ ఆనందపడుతున్నారని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తంచేశారు. ఆర్యవైశ్యులతో పాటు అన్ని వర్గాలను ఆదుకుంటామని హామీనిచ్చారు.