Secretariat తెలంగాణలో సెక్రటేరియట్ గొప్పగా కట్టుకున్నారు. చాలా మంది ఆ ఫొటోలను షేర్ చేస్తూ సంబురపడుతున్నారు. ఏపీలో కూడా దానిని చూసి అహో.. ఓహో అంటూ గొప్పలు చెబుతున్నారు. కానీ ఏపీలో ఇలాంటి సెక్రటేరియట్ కోసం ఎందుకు పట్టించుకోవడం లేదు. ఏపీలో ఒక రాజధానినే కట్టేందుకు నిర్ణయం తీసుకుంటే, దానిని తొక్కేశారు. కులం అంటూ మచ్చ వేసి, దానిని ఆదిలోనే చంపేశారు. దీనికి ప్రధాన కారణం కులగజ్జి. తెలంగాణలో భూముల ధరలు అంతకంతకూ పెరుగుతున్నా, ఇక్కడ ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లు తయారైనా పట్టించుకోలేదు. ఎందుకంటే కులం అనేది ముఖ్యమని అభిప్రాయం వ్యక్తమవుతున్నది.
తెలంగాణతో పాటు ఏపీ ఒకే సారి ప్రయాణం ప్రారంభించాయి. తెలంగాణకు హైదరాబాద్ ఉన్నా, తొలి ఐదేండ్లలో ఏపీ కంటే తెలంగాణ వెలవెలబోయింది. ఏపీకి అమరావతి రాజధాని ప్రకటించిన తర్వాత ఇక అతి పెద్ద నగరంగా తయారు కాబోతుందని అంతా అనుకున్నారు. అసియాలో అతి పెద్ద ప్రణాళిక అమరావతి ది అంటూ తెలంగాణ లో కీలక నేతలు కూడా ఒప్పుకున్నారు. ఆ ఐదేండ్లలో ఎన్నో పరిశ్రమలు వెల్లువలా ఏపీకి నాడు వచ్చాయి. సంక్షేమం ఆగలేదు. ఒక్కసారి కూడా ఐదేండ్లలో చార్జీలు పెట్టలేదు. కానీ ఇప్పుడేం జరిగింది. ఏపీ పునాదుల్ని కూల్చేశారు. తెలంగాణలో అభివృద్ధి అందనంత దూరంలోకి వెళ్లింది. అభివృద్ధి అంటేనే తెలంగాణ అనేలా తయారైంది. ఒక కులాన్ని టార్గెట్ చేసి జరుగుతున్న రాజకీయాలు ఇప్పుడు ఏపీని భ్రష్టుపట్టించాయనేది కాదనలేని సత్యం.
తెలంగాణలో హైదరాబాద్ శివార్లలో భూముల రేట్లు అమాంతం పెరిగాయి. నాలుగేళ్లలో సామాన్యుడు అందుకోనంత దూరంలో ధరలు అమాంతం పెరిగాయి. కానీ ఏపీ ప్రజల ఆస్తుల విలువ పెరగకపోగా, తగ్గిపోయాయి. ఏపీ మొత్తం ఇదే పరిస్థితి. దీనంతటికీ కారణం కేవలం కులం ప్రతిపాదికన ఏపీలో రాజకీయాలు జరగడమే అని కాదనలేని అభిప్రాయం. మరి రానున్న రోజుల్లోనైనా పరిస్థితిలో మార్పు వస్తుందా అంటే శూన్యమే కనిపిస్తున్నది. ఇకా అదే జరిగితే ఏపీని ఆ భగవంతుడు కూడా కాపాడలేడు.