
Deadline : తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి కీలక నోటీసులు అందాయి. హైదరాబాద్ ఓఆర్ఆర్ టెండర్ల అంశంపై రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలకు హెచ్ఎండీఏ ఈ నోటీసులు ఇచ్చింది. రేవంత్ రెడ్డి నిరాధార ఆరోపణలు చేశారని పేర్కొంది. టెండర్లకు సంబంధించిన పూర్తి వివరాలు సామాన్య ప్రజలకు కూడా అందుబాటులో ఉన్నాయని తెలిపింది. నోటీసు అందిన 48 గంటల్లో రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని నోటీసుల్లో పేర్కొంది
అయితే కొంతకాలంగా ఓఆర్ఆర్ టెండర్ల అంశం వివాదాస్పదమవుతున్నది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కంటే ఓఆర్ఆర్ స్కాం అతి పెద్దదని రేవంత్ రెడ్డి ఆరోపిస్తూ వస్తున్నారు. లక్షల కోట్ల ఆస్తిని రూ. 7 వేల కోట్లకు కట్టబెట్టారని విమర్శిస్తున్నారు. ఇదే అంశంపై హెచ్ఎండీఏ తీవ్రంగా స్పందించింది. రేవంత్ రెడ్డి నిరాధార ఆరోపణలు చేశారని పేర్కొంది. ఒక జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి ఇలా మాట్లాడడం సరికాదని తెలిపింది. హెచ్ఎండీఏకు ఐఆర్బి ఇన్ ఫ్రా కు మధ్య కుదిరిన ఒప్పందంపై వివరాలు తెలుసుకోకుండా , టెండర్ సారాంశాన్ని ధ్రువీకరించుకోకుండా ఆరోపణలు చేశారని పేర్కొంది. ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు పంపాలనే ఉద్దేశంతోనే రేవంత్ రెడ్డి ఇలా మాట్లాడినట్లు భావిస్తున్నామని తెలిపింది. రాజకీయ మైలేజ్ పొందాలని ఏకైక లక్ష్యంతో ఈ ప్రకటన చేసినట్లు అర్థమవుతుందని స్పష్టం చేసింది. నోటీస్ అందుకున్న 48 గంటల్లో రేవంత్ రెడ్డి భేషరతు గా క్షమాపణ చెప్పాలని కోరింది.