YCP 11th List : వైసీపీ అభ్యర్థుల ప్రకటనను మరింత వేగవంతం చేసింది. తాజాగా తన 11వ జాబితాను విడుదల చేసింది. ఇందులో మూడు పేర్లు ఉన్నాయి. రెండు పార్లమెంట్ స్థానాలు, ఒక అసెంబ్లీ స్థానానికి అభ్యర్థులను ప్రకటించారు. కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గం ఇన్ చార్జిగా బీవై రామయ్య, అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గం ఇన్ చార్జిగా రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ను నియమించింది. అలాగే రాజోలు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ చార్జిగా ఇటీవల పార్టీలో చేరిన మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావును నియమించింది.
కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ చార్జిగా తొలుత మాజీ మంత్రి గుమ్మనూరు జయరాంను వైసీపీ అధిష్ఠానం నియమించింది. అయితే ఆలూరు అసెంబ్లీ నుంచే తిరిగి పోటీ చేస్తానంటూ జయరాం పట్టుబట్టారు. అయితే దీనికి వైసీపీ అధిష్ఠానం అంగీకరించకపోవడంతో జయరాం పార్టీని వీడారు. టీడీపీలో చేరి గుంతకల్లు నుంచి పోటీ చేసే ఆలోచనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన స్థానంలో బీవై రామయ్యను కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ చార్జిగా వైసీపీ నియమించింది.
అలాగే ఇటీవలే పార్టీలో చేరిన మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావుకు కూడా జగన్ అవకాశం కల్పించారు. గొల్లపల్లిని రాజోలు అసెంబ్లీ ఇన్ చార్జిగా నియమించారు. ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న రాపాక వరప్రసాద్ ను అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించారు. గొల్లపల్లి సూర్యారావు 2004లో కాంగ్రెస్ నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలుపొందారు. వైఎస్ హయాంలో మంత్రిగా పనిచేశారు. 2014లో టీడీపీలో చేరారు. 2019 ఎన్నికల్లో రాజోలులో రాపాక చేతిలో ఓడిపోయారు. ఇటీవల టీడీపీ, జనసేన కూటమి పొత్తులో భాగంగా సీటు వచ్చే అవకాశం లేదనే అనుమానంతో వైసీపీలో చేరిపోయారు.
ఇక రాపాక వరప్రసాద్ 2019లో రాజోలు నుంచి జనసేన అభ్యర్థిగా గెలుపొందారు. ఆ పార్టీ నుంచి ఏకైక ఎమ్మెల్యే అయిన ఆయన తర్వాత వైసీపీకి మద్దతుగా నిలిచారు. రాబోయే ఎన్నికల్లో రాజోలు ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావించినా వైసీపీ అధిష్ఠానం అమలాపురం పార్లమెంట్ అభ్యర్థిగా బరిలో నిలుపాలని నిర్ణయించింది.