ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈరోజు ఢిల్లీ వెళ్తున్నారు. కొత్త రాజకీయ పార్టీ పెట్టే ఆలోచనలో పొంగులేటి ఉన్నాడన్న విషయం తెలిసిందే. పారిశ్రామికవేత్త అయిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఖమ్మం జిల్లాలో చాలా మంచి పేరుంది. ఖమ్మం జిల్లా అంతటా అనుచరవర్గం పెద్ద ఎత్తున ఉంది. దాంతో ఖమ్మం జిల్లా లోని మొత్తం 10 నియోజకవర్గాల్లో ఎంతో కొంత ప్రభావం చూపంచగలిగే సత్తా ఉన్న నాయకుడు కావడంతో రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. పొంగులేటి ఖమ్మం జిల్లాలో కనీసం 4 స్థానాలను గెలుచుకునే సత్తా ఉన్న నాయకుడు కావడం విశేషం.
అలాంటి నాయకుడు పొంగులేటిని తమ పార్టీలో చేర్చుకోవాలని అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ ప్రయత్నాలు చేసాయి. అయితే పొంగులేటి ఆలోచన మాత్రం మరోలా ఉంది. ఎందుకంటే పొంగులేటి వెనకాల ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఉన్నారని తెలుస్తోంది. గతంలో వైసీపీ లోనే ఉన్నాడు పొంగులేటి. రాష్ట్ర విభజన అయ్యాక తెలంగాణ వైసీపీ శాఖకు అధ్యక్షుడిగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని నియమించాడు జగన్.
2014 లో జరిగిన ఎన్నికల్లో ఖమ్మం పార్లమెంట్ సభ్యుడుగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విజయం సాధించాడు. అలాగే 2 అసెంబ్లీ స్థానాలను కూడా గెలిపించుకున్నాడు. అయితే తెలంగాణ రాజకీయాల్లో గులాబీ ఆధిపత్యం ప్రదర్శించడంతో వైసీపీకి రాజీనామా చేసి గులాబీ తీర్థం పుచ్చుకున్నాడు. కేసీఆర్ , కేటీఆర్ నాయకత్వంలో పని చేస్తానని అన్నాడు పొంగులేటి. అయితే 2018 లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో అధికార TRS కేవలం ఒక్క స్థానాన్ని మాత్రమే గెలుచుకుంది. మిగతా 9 స్థానాల్లో 7 కాంగ్రెస్ పార్టీ గెలుచుకోగా తెలుగుదేశం పార్టీ భూస్ధాపితం అనుకుంటే ఖమ్మం జిల్లాలో 2 స్థానాల్లో విజయం సాధించడం విశేషం.
ఆ ఎన్నికల ఫలితాలతో పొంగులేటికి 2019 లో కేసీఆర్ హ్యాండ్ ఇచ్చాడు. లోక్ సభ సీటు ఇవ్వకుండా అవమానించాడు. అయినా పార్టీలోనే కొనసాగాడు. అయితే పార్టీలో తనకు అవమానాలు ఎదురు అవుతుంటే అలాగే తన అనుచరులకు కూడా అవమానాలు జరుగుతుంటే అప్పుడు తిరుగుబాటు జెండా ఎగురవేశాడు పొంగులేటి. అందుకే ఢిల్లీ యాత్ర.
TRS ( తెలంగాణ రైతు సమితి లేదా తెలంగాణ రైతు సమాఖ్య ) అనే పేరుతో కొత్త రాజకీయ పార్టీని స్థాపించడానికి సిద్దమయ్యాడట పొంగులేటి. ఇందుకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆశీస్సులు ఉన్నాయని , తెరవెనుక మంత్రంగమంతా జగన్ దే అని రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తెలంగాణ సెంటిమెంట్ ను అస్త్రంగా ప్రయోగించడానికి పొంగులేటి సిద్ధమయ్యాడని సమాచారం.