
కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ చారిత్రక విజయం సాధించింది. అత్యధిక సీట్లను గెల్చుకొని ప్రభుత్వ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తు్న్నది. ఈ రోజు జరిగే సీఎల్పీ మీటింగ్ లో ముఖ్యమంత్రి ఎవరనేది తేలనుంది. అయితే కర్ణాటకలో తమ పార్టీ గెలుపుపై తెలంగాణలోని కాంగ్రెస్ శ్రేణుల్లో సంబురాలు మిన్నంటాయి. హైదరాబాద్ లోని గాంధీభవన్ వద్ద సందడి నెలకొంది.
తెలంగాణలో ఎందుకుంటే..
కర్ణాటకలో కాంగ్రెస్ విజయంతో ఆ పార్టీ తెలంగాణ శ్రేణుల్లో జోష్ నింపింది. మరో ఆరు నెలల్లో తెలంగాణ లో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలవడం వారికి కొంత బలం పెరుగుతుందని భావిస్తున్నారు. తెలంగాణలో నూ పార్టీ గతంలో కంటే కొంత ఉత్సాహంగా పనిచేసే వీలు కలుగుతుందని భావిస్తున్నారు. వచ్చే నెల నుంచి పార్టీ అధినాయకుల రాకతో ఈ వేడి మరింత పెరగనుంది. రాష్ర్టంలో రెండో స్థానంలో నిలుస్తుందనే అంచనాల నేపథ్యంలో మరి కొంత కష్టపడితే అధికారం చేజిక్కించుకోవడం ఖాయమని వారు భావిస్తున్నట్లుగా తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో కర్ణాటక విజయం వారిలో కొత్త ధీమాను నింపింది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం ఫోకస్ అంతా తెలంగాణపై నే ఉంది. అందుకు అనుగుణంగా ప్రణాళికలతో ముందుకెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. తెలంగాణలో కూడా పాగా వేస్తే 2024 ఎన్నికల్లో బీజేపీ కి గట్టి పోటీ ఇయవచ్చని కాంగ్రెస్ భావన. అయితే తెలంగాణలో జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కర్ణాటక నుంచి అన్ని రకాల సహాయ సహకారాలు అందుతాయని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. బీజేపీ కూడా ఇదే భావించింది. కానీ వారు అక్కడ నంబర్ 2 కే పరిమితమయ్యారు. ప్రజా తీర్పు వ్యతిరేకంగా రావడంతో కొంత ఢీలా పడ్డారు. ఏదేమైనా తెలంగాణలో పాగా వేయడమే లక్ష్యమని కాంగ్రెస్ శ్రేణులు అంటున్నాయి. కర్ణాటకలో గెలుపుతో మాకు ఎంతో బలం చేకూరిందని చెప్పుకుంటున్నారు.