Project K ఇటీవల ప్రభాస్ నటించిన ‘ప్రాజెక్ట్-కే’లో కల్కి ప్రస్తావన వచ్చింది. ఈ నేపథ్యంలో కల్కి అవతారం ఏంటి? అతడు ఎక్కడి నుంచి వస్తాడు? అనేది హాట్ టాపిక్ గా మారింది. ఈ కల్కి అవతారం ఎప్పుడొస్తుంది. కల్కి అవతరిస్తే ఏం జరుగుతుంది. శంభళ అంటే ఏమిటి? తదితర అంశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ధర్మ సంస్థాపనార్దాయ సంభవామి యుగేయుగే.. భగవద్గీతలో శ్రీ కృష్ణుడు అర్జునుడికి చెప్పిన మాట. అంటే అధర్మం పెరిగినప్పుడు ధర్మ స్థాపన కోసం ప్రతీయుగంలో అవతరిస్తానని అర్జునికి శ్రీకృష్ణుడు చెబుతాడు. అలా కలియుగంలోను విష్ణువు కల్కిగా అవతరిస్తాడని పురాణాలు చెప్తున్నాయి. మహాభారతంను రచించిన వేదవ్యాసుడే ఈ కల్కి అవతారానికి సంబంధించి కల్కి పురాణం కూడా రాశాడు.
కలియుగం చివరి దశలో అవినీతి, అధర్మం ఇప్పుడున్నదాని కంటే ఎన్నో రెట్లు పెరిగి పోయి అదే రాజ్యమేలుతుంది. ఎక్కడా యజ్ఞ యాగాలు జరగవు. వివాహ వ్యవస్థ మాయమైపోతుంది. మనిషి ఆయుర్దాయం 18 ఏళ్లకే క్షీణించి పోతుంది. ఇలా ఎటు చూసినా చీకట్లు కమ్ముకున్న పరిస్థితులలో ‘శంభళ’ అనే గ్రామంలో కల్కి అవతరిస్తాడు. విష్ణు వ్యాసుడు-సుమతి దంపతులకు కల్కి జన్మిస్తాడు. లోక రక్షణ కోసం అవినీతి, అక్రమం వంటి అధర్మ పద్ధతులను అస్త్రాలుగా చేసుకొని రాజ్యాలను ఏలుతున్న వారిని హతమార్చి సత్యయుగానికి బాటలు వేస్తాడు. ఓ చేతిలో ఖడ్గం, మరో చేతిలో సుదర్శన చక్రం ధరించి శ్వేత వర్ణంలో ఉండే దేవదత్త అనే అశ్వంపై కల్కి తిరుగుతూ దుష్టులను శిక్షిస్తూ లోకోద్ధరణకు పాటు పడతాడు. కోక, వికోక అనే ఇద్దరు కవల రాక్షసులు సహా ఎందరో అసురులను అంతం చేస్తాడు.
ఇక కల్కి పుట్టబోయే ఈ శంభళ గురించి కూడా తెలుసుకునేందుకు అందరిలో ఆసక్తి నెలకొంది. ఈ శంభళ ప్రాంతం హిమాలయాల్లో ఉంటుందని కొందరి అభిప్రాయం. సామాన్యులకు ఈ ప్రాంతం కనిపించదని, కేవలం పుణ్య పురుషులకు మాత్రమే కనిపిస్తుందని చాలా మంది విశ్వాసం. జర్మన్ నియంత అడాల్ఫ్ హిట్లర్ తన రాజ్యాభివృద్ధి కోసం కొన్ని సమస్యల పరిష్కారానికి హిందూ పురాణాలను చదువుతుండగా అందులో ‘శంభళ’ నగర విశిష్టత గురించి తెలుసుకున్నాడు. దీంతో ఓ స్పెషల్ టీంను ఆ ప్రాంతం వెతికేందుకు పంపించగా వారు ఆచూకీ తెలుసుకోలేకపోయారు. చివరకు ఓ సన్యాసిని ప్రశ్నించగా ఈ శంభళ ప్రాంతం కేవలం పుణ్యాత్ములకు మాత్రమే కనబడుతుందని ఆ సన్యాసి చెప్పాడు.