నటసింహం నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటే అభిమానుల్లో మాములు అంచనాలు ఉండవు ఎందుకంటే ఈ కాంబినేషన్ లో వచ్చిన మూడు సినిమాలు ” సింహా ” , ” లెజెండ్ ” , ” అఖండ ” రికార్డుల మోత మోగించాయి. దాంతో ఈ కాంబినేషన్ కు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఇక ఈ కాంబినేషన్ లో మరో సినిమాకు రంగం సిద్ధమౌతోంది.
బాలయ్య నటించిన వీర సింహా రెడ్డి చిత్రం ఈనెల 12 న విడుదల అవుతున్న విషయం తెలిసిందే. ఆ సినిమా విడుదల కాకముందే అనిల్ రావిపూడి దర్శకత్వంలో 108 వ చిత్రాన్ని చేస్తున్నాడు. ఈ చిత్రానికి ” బ్రో ఐ డోంట్ కేర్ ” అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఇక ఈ సినిమాను పూర్తి చేసాక 109 వ చిత్రాన్ని బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేయనున్నట్లు తెలుస్తోంది.
2024 లో ఏపీలో అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి. దాంతో రాజకీయ నేపథ్యంలో సినిమా చేయనున్నట్లు సమాచారం. సింహా , లెజెండ్ , అఖండ చిత్రాలను మించి ఉండేలా ప్లాన్ చేస్తున్నాడట దర్శకుడు బోయపాటి శ్రీను. తనని ఎలా చూపించాలో , తన అభిమానులను మెప్పించేలా ఎలాంటి పాత్రలో చూపించాలో బోయపాటి శ్రీనుకు బాగా తెలుసు కాబట్టి మరో ఆలోచన లేకుండా బోయపాటి చెప్పినట్లు చేయడానికి మానసికంగా సిద్దమయ్యాడు బాలయ్య.
ఇక ఈ కాంబినేషన్ లో సినిమా అంటే అభిమానులకు పూనకాలు రావడం ఖాయం. అభిమానుల అంచనాలకు తగ్గట్టుగానే నాలుగో సినిమా ఉండనుందని సమాచారం. ప్రస్తుతం బోయపాటి శ్రీను హీరో రామ్ తో సినిమా చేస్తున్నాడు. అది అయ్యాక బాలయ్య సినిమా మీద దృష్టి పెట్టనున్నాడు.