
End of NTR life : నందమూరి తారక రామరావు.. అటు సినిమా.. ఇటు రాజకీయ రంగాలను శాసించిన వ్యక్తి. తెలుగు వారి గుండెల్లో నేటికీ చిరస్మరణీయుడు ఆయన. ఇప్పటికీ ఆయన పేరును పలు రాజకీయ పార్టీలు, నాయకులు జపం చేస్తున్నారంటే ప్రజల గుండెల్లో ఆయన స్థానం ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నట సార్వభౌముడిగా, ముఖ్యమంత్రిగా తెలుగు జాతి, భాషా ఔన్నత్యానికి ఆయన చేసిన కృషి తెలగు ప్రజానీకం మరువజాలదు. అయితే ఆయన జీవిత చరమాంకంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. కారణమేదైనా ఆయన మరణం ఇప్పటికీ సంచలనమే.
ఎన్టీఆర్ మొదట భార్య బసవతారకం.. ఆమెకు పదిమంది సంతానం. అయితే బసవతారకం మరణాంతరం 1993లో ఎన్టీఆర్ లక్ష్మీపార్వతిని వివాహం చేసుకున్నారు. ఆమెకు కూడా ఇది రెండో వివాహమే. అప్పటికే ఆమెకు కొడుకు ఉన్నాడు. అయితే ఒక బహిరంగ సభలో తాను లక్ష్మీపార్వతిని పెండ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించి సంచలనం రేపాడు. ఆ తర్వాత నందమూరి కుటుంబాలు కలహాలు మొదలైనట్లు చెబుతారు.
రాను రాను కుటుంబ, రాజకీయ వ్యవహారాల్లో లక్ష్మీపార్వతి జోక్యం పెరగడం కుటుంబసభ్యులకు నచ్చలేదంటారు. తదనంతర పరిణామాలు ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీలో చీలికకు కారణమయ్యాయి. చంద్రబాబు నేతృత్వంలో మెజార్టీ ఎమ్మెల్యేలు వైస్రాయ్ హోటల్ కు చేరుకున్నారు. ఎన్టీఆర్ ను గద్దె దించి పార్టీని హస్తగతం చేసుకున్నారు. మెజార్టీ కుటుంబ సభ్యులు ఎన్టీఆర్ వైపు లేకుండా పోయారు. ఎందుకంటే వారంతా లక్ష్మీపార్వతిని ద్వేషించడమే కారణంగా చెబుతారు. ఇప్పటికీ ఆమెను వారు స్వాగతించరంటేనే ఆమె మీద వారికున్న అసంతృప్తిని అర్థం చేసుకోవచ్చు.
అయితే ఎన్టీఆర్ కు మాత్రం జీవిత చరమాంకంలో లక్ష్మీపార్వతినే అండగా నిలిచారు. ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా చంద్రబాబు క్యాంపు పెట్టారని తెలుసుకొని ఆయనతో ఢీ అంటే ఢీ అనే స్థాయికి వెళ్లారు. వైస్రాయ్ హోటల్లో ఎమ్మెల్యేలు ఉన్న విషయాన్ని తెలుసుకొని ఎన్టీఆర్ వెళ్లగా, ఆమె కూడా ఆయనతో కలిసి సాగారు. ఆ తర్వాత జరిగిన అన్ని పరిణామాల్లోనూ ఆయన వెన్నంటే ఉన్నారు. అనారోగ్యం బారిన పడి ఎన్టీఆర్ ఇంట్లో ఉన్నప్పుడు అన్ని సపర్యలు ఆమె చేశారు. ఇదే టీడీపీకి తన తర్వాత వారసురాలు లక్ష్మీపార్వతే అని అన్న ఎన్టీఆర్ ప్రకటించే వరకు వెళ్లింది.
అనంతరం ఎన్టీఆర్ మరణించడం.. లక్ష్మీపార్వతి 1995 లోఎన్టీఆర్ టీడీపీ పార్టీ ప్రకటించి, ఇదే అసలు టీడీపీ అని చెప్పుకోవడం జరిగింది. అయితే నాడు జరిగిన ఉపఎన్నికల్లో ఆమె ఒక్కరే ఆ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే చంద్రబాబుకు ఇటు కుటుంబసభ్యుల మద్దతు ఉండడం, మెజార్టీ నాయకులు ఆయనతోనే కలిసి సాగడం, ప్రజలు కూడా ఇటు వైపే మొగ్గడంతో కాలక్రమేణా ఎన్టీఆర్ టీడీపీ కనుమరుగైంది. ఇక ప్రస్తుతం ఆమె వైసీపీలో చేరారు. ఇంకా చంద్రబాబుపై తన పోరాటం చేస్తూనే ఉన్నారు. నందమూరి కుటుంబమే తనను వంచించిందని, దీని వెనుక మాత్రం నారా చంద్రబాబునాయుడే కీలకమని ఆమె తరచూ ఆరోపిస్తుంటారు. ఎన్టీఆర్ ఆకస్మిక మృతికి కూడా చంద్రబాబే కారణమని ఆమె తరచూ మాట్లాడుతుంటారు.